ఇదొక సరికొత్త వస్త్ర ప్రపంచం. వినూత్న రీతుల్లో.. విభిన్న రంగుల్లో.. వివిధ రకాల డ్రెస్సులు మనముందు ఉంటున్నాయి. కొందరు ఫేషన్ అంటారు. మరికొందరు ప్యాషన్ అంటారు. కొత్త కొత్త మోడల్స్‌తో మోడ్రన్ ట్రెండ్‌ను సెట్ చేస్తున్నది వస్త్రం. వస్త్రం పుట్టుక ఏంటి? అది వస్త్రమెలా అయ్యింది? విభిన్న రీతుల్లో ఎలా డిజైన్ చేయగలుగుతున్నారు? బట్టల్ని కుట్టే సాధనాన్ని ఏమంటారు? దానిని ఎవరు కనిపెట్టారు? తెలుసుకుందాం.
ఆదిమానవుడు చెట్ల తొర్రల్లో నివసించేవాడు. చెట్ల ఆకులతో శరీరం కప్పుకునేవాడు. ఎందుకు? అప్పుడు బట్టలెక్కడివి? ఆ ఆలోచన ఎక్కడిది? మనిషి రాయిని రాయిని రాపాడించి నిప్పు పుట్టించగలిగిన తర్వాత తిండి కోసం మనసు పెట్టి ఆలోచనలు చేసిన తర్వాత శరీరాన్ని కప్పుకోవడం గురించి ఆలోచించాడు. ఆ క్రమంలో చెట్ల ఆకులనే వస్త్రంగా వాడుకున్నాడు. కానీ కాలక్రమేణా ఆలోచనా విధానంలో మార్పు ఏర్పడి దారం తయారుచేయడం.. దానితో బట్టలు నేయడం.. చుట్టుకోవడం నేర్చుకున్నాడు. మనిషి ఆలోచన పదునెక్కింది. బట్టలు చుట్టుకునే స్థాయి నుంచి బట్టల్ని శరీరాకృతినిబట్టి కుట్టుకునే స్థాయికి చేరుకున్నాడు. వస్త్రం తయారుచేసినప్పటి నుంచి చూసుకుంటే తమకు తోచిన విధంగా ఒక్కొక్కరు ఒక్కో ప్రయోగం చేస్తూ వచ్చారు. అలా ఎన్నో ఏండ్లు గడిచాయి. ఆధునిక పరిజ్ఞానం రూపుదిద్దుకున్న తర్వాత బట్టలు కుట్టేందుకు ఒక సాధనం కనుక్కోవాలనే ప్రయోగాలెన్నో జరిగాయి. ఎవరి ప్రయత్నం వారు చేశారు. అలా ఎన్నో ప్రయోగాల ఫలితమే కుట్టుమిషన్.
ఆధునిక యుగంలో కుట్టుమిషన్ లేని జీవితాన్ని ఊహించగలమా? మొదట్లో కుట్టుపని అంతా చేతులతోనే జరిగేది. అలా ఎంతసేపు కుడతాం? ఎన్ని బట్టలని కుడతాం? అందుకే ఐజాక్ మెరిట్ సింగర్ అనే సాదాసీదా వ్యక్తి ఇప్పుడు మనం వాడుతున్న కుట్టు మిషన్‌ను రూపొందించాడు. అయితే మెరిట్ సింగర్ కన్నా ముందు కుట్టుమిషన్‌ను ఎలియాస్ హోవే అనే అమెరికన్ కనిపెట్టాడు. కానీ ఆధునిక పద్ధతుల్లో నేటి పరిస్థితులకు అనుగుణంగా కుట్టుమిషన్‌ను చేసిపెట్టింది మాత్రం సింగరే అని చెప్పొచ్చు.
సింగర్ అక్టోబర్ 27, 1811న జన్మించాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. అమెరికాలోని న్యూయార్క్ పిట్స్‌టౌన్‌లో వాళ్ల నివాసం. జర్మనీ నుంచి వలస వచ్చిన యూదు కుటుంబం. తండ్రి ఆడమ్ సింగర్.. తల్లి రూత్ బెన్సన్. రోజూ ఏదో ఒక పనిచేస్తేనే కుటుంబం గడిచేది. వాళ్ల నాన్న ఏదో కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సింగర్ ఇంట్లో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి అల్లరి పిల్లవాడిగా పెరిగాడు. ఎక్కడా నిలకడలేని మనస్తత్వం.